శ్రీరమ్యమ్బుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని
పల్లెలు పురములు పట్టణమ్బులు పేటలు దాటితి అడవులు కొణ్డలు అన్నీ దాటితి
కణ్టిని శ్రీగిరి కన్నుల నిణ్డా విణ్టిని మహిమలు వీనుల నిణ్డా
ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము
ధారుణి లోపల ధౌతాచలమది మేరుని కణ్టెను మిక్కుట మైనది
బ్రహ్మ నిర్మల బ్రహిశృఙ్గమ్బులు నిర్మలమగు మాణిక్య కూటములు
కోటలు కొమ్మలు గోపురమ్బులు తెఱపిలేని బహు దేవాలయములు
పుణ్య స్థలమ్బులు పుణ్య వనమ్బులు వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మఞ్చి మృగమ్బులు కామధేనువులు కల్పవృక్షములు
క్షేమ కరమ్బగు చిన్తామణులు అమృత గుణ్డమ్బులు
కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శమ్భుని వేడెటి రాజులు
సన్తత లిఙ్గార్చన గల శైవులు శాన్తులైన వేదాన్తులు సిద్ధులు
గణగణ మ్రోగెటి ఘణ్టనాదములు విజయ ఘోషయగు శఙ్ఖ నాదములు
వీర శైవులు వీరాఙ్గమ్బులు సాధు బృన్దములు కామిత భక్తులు అగరు ధూపములు
జపములు చేసెటి జఙ్గమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమథులు భక్తులు శైవ గణమ్బులు గట్టిగ ఇది భూకైలాసమ్మని
తప్పిపోక పాతాళ గఙ్గలో తెప్పున తేలుచు తీర్థమ్బాడుచు
చెలగుచు మడి వస్త్రమ్బులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని
పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి
గురు మన్త్రమ్బును జపమును చేసితి అకళఙ్కుడనై ఆశ జయిస్తిని
శివ పఞ్చాక్షరి మనసున నిలిపితి శివ తత్త్వము పరిశీలన చేసితి
పఞ్చేన్ద్రియమ్బులు పదిలము చేసితి పఞ్చ ముద్రలభ్యాసము చేసితి
అన్తర్ముఖుడనైతిని, నాదబ్రహ్మ నాదము విణ్టిని లోపల తుమ్మెద నాదము విణ్టిని
వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు ఆ లోపల దీపము కణ్టిని
ఈవల చన్ద్రుణ్డావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిధానము కణ్టిని
కణ్టికి ఇమ్పగు పణ్డు వెన్నెల విరిసిన షట్కమలమ్బులు పిణ్డాణ్డములో బ్రహ్మాణ్డము కణ్టిని
అన్తట అక్కడ చెఙ్గల్వ కొలనులో ఆడుచున్న రాజహంసను పట్టితి
చాల వేయి స్తమ్భాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని
మల్లికార్జునుని మదిలో దలచితి మున్దర భృఙ్గికి మ్రొక్కి వేడితిని
నన్దికేశ్వరుని నమ్మి భజిఞ్చితి చణ్డీశ్వరునకు దణ్డము పెట్టితి
మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి
ద్వార పాలకుల దర్శన మాయను ద్వార మన్దు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లిఙ్గం చూచితి కేవల సున్దర లిఙ్గం
నిరుపద్రవమగు నిశ్చల లిఙ్గం ఆది తేజమగు ఐక్య లిఙ్గం
రాజితమైన విరాజిత లిఙ్గం పూజనీయమగు పురాణ లిఙ్గం
లిఙ్గము గనుగొని లిఙ్గ దేహినై లిఙ్గాఙ్గులతో లిఙ్గ నిర్గుణ సఙ్గతి కణ్టిని
లిఙ్గమన్దు మది లీనము చేసితి జీవన్ముక్తడనైతిని
అఙ్కమన్ది భ్రమరామ్బిక ఉణ్డగా మల్లికార్జునిని కోరి పూజిఞ్చితి
దీపము పెట్టితి దివ్య దేహునకు ధూపము వేసితి ధూర్జటి కప్పుడు
తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి
సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ జయ జయ జయ జఙ్గమరాయ
ఆదిదేవుడవు ఆత్మ శరణ్య దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్తనిధాన
ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలమ్పక నీచుడనైతిని
ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్ట మానసుడ గౌరీ రమణ
తామస గుణములు తగులాటమ్బులు నియమము తప్పిన నీచవర్తనుడ
నిత్య దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును
చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి
సంసారమ్బను సఙ్కెళ్ళల్లో హింస పెట్టమిక ఏలుము తణ్డ్రి
ముల్లోకమ్బులు ముఞ్చెడి గఙ్గను సలలితముగా జడ ధరియిస్తివి
గొప్ప చేసి నిను కొలిచిన బణ్టును తప్పక చన్ద్రుని తల ధరియిస్తివి
విన్నుని చేత కన్ను పూజగొని సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి
ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి
మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే
దాతవు నీవే,భ్రాతవు నీవే,తల్లివి నీవే,తణ్డ్రివి నీవే,బ్రహ్మము నీవే,సర్వము నీవే
పాల ముఞ్చుమిక నీట ముఞ్చు మీ పాల బడితనో ఫాలలోచన అనుచు ప్రణతుల నిడుచు
ఫలశృతి
కాలువలు త్రవ్విఞ్చి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజిఞ్చిన ఫలము
గఙ్గి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము
ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనమ్బిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షిఞ్చు విశేష ఫలము
అన్త కన్నా ఫలము అధిక మయ్యుణ్డు