View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

దేవీ మాహాత్మ్యం మంగళ నీరాజణం

శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమందు ॥

బంగారు హారాల శింగారమొలకించు అంబికా హృదయాన నీరాజనం
శ్రీ గౌరీ శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనమ్ ॥
కల్పతరువుగ నన్ను కాపాడే కరములకు కనకంబురాశులతో నీరాజనం
పాశాంకుశ పుష్ప బాణ చాపధరికి పరమపావనమైన నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమందు ॥

కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం
కాంతలందరి పసుపుకుంకుమలు కాపాడే కాత్యాయనికి నిత్య నీరాజనమ్ ॥
సిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలువరేకులవంటి కన్నుల తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమందు ॥

ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరమకుటంబులో దాల్చు సౌందర్యలహరికి నీరాజనమ్ ॥
శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాతకు నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమందు ॥

ఎల్లలోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండరూపిణికి నీరాజనం
ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనమ్ ॥
రాధా జీవన రాగ నామ సంకీర్తనగా రంజిల్లు కర్పూర నీరాజనం
జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్త జనులిచ్చేటి నీరాజనమ్ ॥

శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనం
సింహమధ్యకు రత్న నీరాజనం
సింహమధ్యకు రత్న నీరాజనం




Browse Related Categories: