View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

శ్రీ కాళ హస్తీశ్వర శతకమ్

శ్రీవిద్యుత్కలితాఽజవఞ్జవమహా-జీమూతపాపామ్బుధా-
రావేగమ్బున మన్మనోబ్జసముదీ-ర్ణత్వమ్బుం గోల్పోయితిన్ ।
దేవా! మీ కరుణాశరత్సమయమిన్-తేం జాలుం జిద్భావనా-
సేవం దామరతమ్పరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥

వాణీవల్లభదుర్లభమ్బగు భవద్ద్వారమ్బున న్నిల్చి ని
ర్వాణశ్రీం జెఱపట్టం జూచిన విచారద్రోహమో నిత్య క
ళ్యాణక్రీడలం బాసి దుర్దశలపా లై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూఱఞ్జేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥

అన్తా మిధ్య తలఞ్చి చూచిన నరుం డట్లౌ టెఱిఙ్గిన్ సదా
కాన్త ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కమ్బఞ్చు మోహార్ణవ
చిభ్రాన్తిం జెన్ది జరిఞ్చు గాని పరమార్ధమ్బైన నీయన్దుం దాం
జిన్తాకన్తయు జిన్త నిల్పణ్డుగదా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 3 ॥

నీ నా సన్దొడమ్బాటుమాట వినుమా నీచేత జీతమ్బు నేం
గానిం బట్టక సన్తతమ్బు మది వేడ్కం గొల్తు నన్తస్సప
త్నానీకమ్బున కొప్పగిమ్పకుము నన్నాపాటీయే చాలుం దే
జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 4 ॥

భవకేలీమదిరామదమ్బున మహా పాపాత్ముణ్డై వీడు న
న్ను వివేకిమ్పం డటఞ్చు నేను నరకార్ణోరాశిపాలైనం బ
ట్టవు; బాలుణ్డొకచోట నాటతమితోడ న్నూతం గూలఙ్గం దం
డ్రి విచారిమ్పక యుణ్డునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 5 ॥

స్వామిద్రోహముం జేసి యేనొకని గొల్వమ్బోతినో కాక నే
నీమాట న్విననొల్లకుణ్డితినొ నిన్నే దిక్కుగాం జూడనో
యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ
చీ మధ్యమ్బున ముఞ్చి యుమ్పదగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 6 ॥

దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా
నువు నీ విల్లు నిధీశ్వరుణ్డు సఖుం డర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకుం డిఙ్క నీకెన ఘనుణ్డుం గల్గునే నీవు చూ
చి విచారిమ్పవు లేమి నెవ్వణ్డుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 7 ॥

నీతో యుధ్ధము చేయ నోమ్పం గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుఞ్జేయగలేను నీకొఱకు దణ్డ్రిఞ్జమ్పగాఞ్జాల నా
చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుఞ్జీకాకు నాభక్తి యే
రీతిన్నాకిఙ్క నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 8 ॥

ఆలుమ్బిడ్డలు దల్లిదణ్డ్రులు ధనమ్బఞ్చు న్మహాబన్ధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళం జిన్తిన్తు ని
ర్మూలమ్బైన మనమ్బులో నెగడు దుర్మోహాబ్ధిలోం గ్రుఙ్కి యీ
శీలామాలపు జిన్త నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 9 ॥

నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నన్తక భుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పున్దారును ముక్తు లౌదు రవి శాస్త్రమ్బుల్మహాపణ్డితుల్
చెప్పఙ్గా దమకిఙ్క శఙ్క వలెనా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 10 ॥

వీడెమ్బబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుమ్బొట్టలోం
గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడఙ్గ వినునప్పుడున్ జెలఙ్గు దమ్భప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 11 ॥

నిను సేవిమ్పగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుణ్డననీ మహాత్ము డననీ సంసారమోహమ్బు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గున్దిమ్పనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 12 ॥

ఏ వేదమ్బు బఠిఞ్చె లూత భుజఙ్గం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనమ్బొనర్చెం గరి చెఞ్చేమన్త్ర మూహిఞ్చె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియె కాక జన్తుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 13 ॥

కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయమ్బు వక్షోజముల్
రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాన్తిచే
బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేం
జేయఞ్జాల విరక్తుం జేయఙ్గదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 14 ॥

నిన్నేరూపముగా భజిన్తు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుఞ్చము మేకపెణ్టికయొ యీ సన్దేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారమ్బుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 15 ॥

నిను నావాఙ్కిలి గావుమణ్టినొ మరున్నీలాకాభ్రాన్తిం గుం
టెన పొమ్మణ్టినొ యెఙ్గిలిచ్చి తిను తిణ్టేఙ్గాని కాదణ్టినో
నిను నెమ్మిన్దగ విశ్వసిఞ్చుసుజనానీకమ్బు రక్షిమ్పఞ్జే
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 16 ॥

ఱాలన్ ఱువ్వగం జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ఞ్చునేం
జాలన్ జమ్పఙ్గ నేత్రము న్దివియఙ్గాశక్తుణ్డనేం గాను నా
శీలం బేమని చెప్పనున్నదిఙ్క నీ చిత్తమ్బు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాఙ్ఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 17 ॥

రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయమ్బు వారిచ్చునం
భోజాక్షీచతురన్తయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజమ్బుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొన్దితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 18 ॥

నీరూపమ్బు దలమ్పఙ్గాం దుదమొదల్ నేగాన నీవైనచో
రారా రమ్మని యఞ్చుం జెప్పవు పృధారమ్భమ్బు లిఙ్కేటికిన్!
నీర న్ముమ్పుము పాల ముమ్పు మిఙ్క నిన్నే నమ్మినాణ్డం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 19 ॥

నీకు న్మాంసము వాఞ్ఛయేని కఱవా నీచేత లేడుణ్డఙ్గాం
జోకైనట్టి కుఠారముణ్డ ననల జ్యోతుణ్డ నీరుణ్డఙ్గా
బాకం బొప్ప ఘటిఞ్చి చేతిపునుకన్ భక్షిమ్పకాబోయచేం
జేకొం టెఙ్గిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 20 ॥

రాజై దుష్కృతిం జెన్దెం జన్దురుణ్డు రారాజై కుబేరుణ్డు దృ
గ్రాజీవమ్బునం గాఞ్చె దుఃఖము కురుక్ష్మాపాలుం డామాటనే
యాజిం గూలె సమస్తబన్ధువులతో నా రాజశబ్ధమ్బు చీ
ఛీ జన్మాన్తరమన్దు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 21 ॥

రాజర్ధాతుణ్డైనచో నెచట ధర్మమ్బుణ్డు నేరీతి నా
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజమ్బుల్ భజియిన్తు రేతెఱఙ్గునన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 22 ॥

తరఙ్గల్ పిప్పలపత్రముల్ మెఱఙ్గు టద్దమ్బుల్ మరుద్దీపముల్
కరికర్ణాన్తము లెణ్డమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరమ్బు లసువుల్ జ్యోత్స్నాపఃపిణ్డముల్
సిరులన్దేల మదాన్ధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 23 ॥

నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నళమ్ములు తల్లిదణ్డ్రులు గురున్దాపత్సహాయున్దు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదామ్భోధి దాటిఞ్చి య
ఛ్చిన్నానన్దసుఖాబ్ధిం దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 24 ॥

నీ పఞ్చం బడియుణ్డగాం గలిగినన్ భిక్షాన్నమే చాలు న్
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవిమ్ప్ఙ్గానోప నా
శాపాశమ్బులం జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బణ్టుగాం
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 25 ॥

నీ పేరున్ భవదఙ్ఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తామ్బూలమున్
నీ పళ్లెమ్బు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాణ్డ న
న్నీపాటిం గరుణిమ్పు మోమ్ప నిఙ్క నీనెవ్వారికిం బిడ్డగాం
జేపట్టం దగుం బట్టి మానం దగదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 26 ॥

అమ్మా యయ్య యటఞ్చు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిం దల్లిదణ్డ్రులనటఞ్చు న్జూడఙ్గామ్బోకు నా
కిమ్మైం దల్లియుం దణ్డ్రియున్ గురుణ్డు నీవే కాక సంసారపుం
జిమ్మఞ్జీకణ్టి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 27 ॥

కొడుకుల్ పుట్ట రటఞ్చు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాన్తులై
కొడుకుల్ పుట్టరె కౌరవేన్ద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 28 ॥

గ్రహదోషమ్బులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామమ్బు ప్ర
త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధమ్బెట్టగానోపునే?
దహనుం గప్పఙ్గఞ్జాలునే శలభసన్తానమ్బు నీ సేవం జే
సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 29 ॥

అడుగమ్మోనిక నన్యమార్గరతులమ్బ్రాణావనోత్సాహినై
యడుగమ్బోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజిమ్పఙ్గాఙ్గనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దిఙ్కేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 30 ॥

మదమాతఙ్గము లన్దలమ్బుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళమ్బు ల్మోక్షమీఞ్జాలునే?
మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశమ్బుం గా
చి దినమ్బుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 31 ॥

రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యమ్బులన్
పాసీ పాయరు పుత్రమిత్రజన సమ్పద్భ్రాన్తి వాఞ్ఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 32 ॥

ఎన్నేళ్ళున్దు నేమి గన్దు నిఙ్కనేనెవ్వారి రక్షిఞ్చెదన్
నిన్నే నిష్ఠ భజిఞ్చెద న్నిరుపమోన్నిద్రప్రమోదమ్బు నా
కెన్నణ్డబ్బెడు న్న్తకాలమిఙ్క నేనిట్లున్న నేమయ్యెడిం?
జిన్నమ్బుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 33 ॥

చావం గాలము చేరువౌ టెఱిఙ్గియుం జాలిమ్పఙ్గా లేక న
న్నెవైద్యుణ్డు చికిత్సం బ్రోవఙ్గలణ్డో యేమన్దు రక్షిఞ్చునో
ఏ వేల్పుల్ కృపఞ్జూతురో యనుచు నిన్నిన్తైనం జిన్తిమ్పణ్డా
జీవచ్ఛ్రాధ్ధముం జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 34 ॥

దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
ననమధ్యోపల వేదికాగ్రమున నానన్దమ్బునం బఙ్కజా
నననిష్థ న్నునుం జూడం గన్ననదివో సౌఖ్యమ్బు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖమ్బు లగునే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 35 ॥

ఆలఞ్చు న్మెడం గట్టి దానికి నవత్యశ్రేణిం గల్పిఞ్చి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సమ్బన్ధమ్బు గావిఞ్చి యా
మాలర్మమ్బున బాన్ధవం బనెడి ప్రేమం గొన్దఱం ద్రిప్పఙ్గాం
సీలన్సీల యమర్చిన ట్లొసఙ్గితో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 36 ॥

తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మిమ్పకుం
డ నుపాయమ్బు ఘటిమ్పు మాగతుల రెణ్ట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయఙ్గల కార్యమ్బున్న సంసేవం జే
సి నినుం గాఞ్చెదఙ్గాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 37 ॥

పదునాల్గేలె మహాయుగమ్బు లొక భూపాలుణ్డు; చెల్లిఞ్చె న
య్యుదయాస్తాచలసన్ధి నాజ్ఞ నొకం డాయుష్మన్తుణ్డై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పఙ్గా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మఞ్చు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 38 ॥

రాజన్నన్తనె పోవునా కృపయు ధర్మమ్బాభిజాత్యమ్బు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యమ్బు కృతమ్బెఱుఙ్గటయు విశ్వాసమ్బు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గాం గతమ్బు గలదే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 39 ॥

మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకమ్బు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చిన్తిఞ్చి చూడఙ్గ నె
ట్లనినం గీటఫణీన్ద్రపోతమదవే దణ్డోగ్రహింసావిచా
రిని గాఙ్గాం నిను గానఙ్గాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 40 ॥

పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మమ్బు నా-
టవికత్వమ్బుం ప్రియమ్బులై భుగహశుణ్డాలాతవీచారులన్
భవదుఃఖమ్బులం బాపు టొప్పుం జెలన్దిమ్బాటిఞ్చి కైవల్యమి-
చ్చి వినోదిఞ్చుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 41 ॥

అమరస్త్రీల రమిఞ్చినం జెడదు మోహం బిన్తయున్ బ్రహ్మప-
ట్టము సిధ్ధిఞ్చిన నాస దీఱదు నిరూఢక్రోధమున్ సర్వలో-
కముల న్మ్రిఙ్గిన మాన దిన్దుం గల సౌ-ఖ్యం బొల్ల నీసేవం జే-
సి మహాపాతకవారిరాశిం గడతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 42 ॥

చనువారిం గని యేద్చువారు జముణ్డా సత్యమ్బుగా వత్తు మే
మనుమానమ్బిఙ్క లేదు నమ్మమని తారావేళ నారేవునన్
మునుఙ్గమ్బోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాం
జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 43 ॥

భవదుఃఖమ్బులు రాజకీటముల నేబ్రార్ధిఞ్చినం బాయునే
భవదఙ్ఘ్రిస్తుతిచేతఙ్గాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మేఙ్కమెడచణ్టన్దల్లి కారుణ్యద్బ
ష్థివిశేషమ్బున నిచ్చి చణ్టమ్బలె నో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 44 ॥

పవి పుష్పమ్బగు నగ్ని మఞ్చగు నకూపారమ్బు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుణ్డౌ విషము దివ్యాహారమౌ నెన్నఙ్గా
నవనీమణ్డలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 45 ॥

లేవో కానలం గన్ధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱులం బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొన్ది భూపాలురన్
సేవల్ సేయఙ్గం బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 46 ॥

మును నేం బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహమ్బుచే నన్దుఞ్జే
సిన కర్మమ్బుల ప్రోవు లెన్ని గలవో చిన్తిఞ్చినన్ గాన నీ
జననమ్బే యని యున్న వాడ నిదియే చాలిమ్పవే నిన్నుం గొ
ల్చిన పుణ్యమ్బునకుం గృపారతుణ్డవై శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 47 ॥

తను వెన్దాక ధరిత్రి నుణ్డు నను నన్దాకన్ మహారోగదీ
పనదుఃఖాదులం బొన్దకుణ్డ ననుకమ్పాదృష్టి వీక్షిఞ్చి యా
వెనుకన్ నీపదపద్మముల్ దలఞ్చుచున్ విశ్వప్రపఞ్చమ్బుం బా
సిన చిత్తమ్బున నుణ్డఞ్జేయఙ్గదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 48 ॥

మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మమ్బులు షట్కఞ్జమ్బులో మోము దా
జలజమ్బో నిటలమ్బు చన్ద్రకళయో సఙ్గమ్బు యోగమ్బొ గా
సిలి సేవిన్తురు కాన్తలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 49 ॥

జలకమ్బుల్ రసముల్ ప్రసూనములు వాచాబన్ధముల్ వాద్యము
ల్కలశబ్ధధ్వను లఞ్చితామ్బర మలఙ్కారమ్బు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగాం గొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 50 ॥

ఏలీల న్నుతియిమ్పవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యఙ్గ్యశ
బ్ధాలఙ్కారవిశేషభాషల కలభ్యమ్బైన నీరూపముం
జాలుఞ్జాలుం గవిత్వముల్నిలుచునే సత్యమ్బు వర్ణిఞ్చుచో
చీ! లజ్జిమ్పరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 51 ॥

పాలుం బువ్వయుం బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరణ్టిపణ్డ్లుం గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలిమ్పరే తల్లిదణ్డ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనమ్బులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 52 ॥

కలలఞ్చున్ శకునమ్బులఞ్చు గ్రహయోగం బఞ్చు సాముద్రికం
బు లటఞ్చుం దెవులఞ్చు దిష్ట్మనుచున్ భూతమ్బులఞ్చు న్విషా
దులటఞ్చు న్నిమిషార్ధ జీవనములఞ్చుం బ్రీతిం బుట్టిఞ్చి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 53 ॥

తలమీన్దం గుసుమప్రసాద మలికస్థానమ్బుపై భూతియున్
గళసీమమ్బున దణ్డ నాసికతుదన్ గన్ధప్రసారమ్బు లో
పల నైవేద్యముం జేర్చు నే మనుజం డాభక్తుణ్డు నీకెప్పుడుం
జెలికాడై విహరిఞ్చు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 54 ॥

ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధమ్బు లీనేర్తురే
వేళ న్వారి భజిమ్పం జాలిపడ కావిర్భూత మోదమ్బునం
గాలమ్బెల్ల సుఖమ్బు నీకు నిఙ్క భక్తశ్రేణి రక్షిమ్పకే
శ్రీలెవ్వారికిం గూడమ్బెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 55 ॥

సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న
న్నలన్తలబెట్టిన నీ పదాబ్ధములం బాయఞ్జాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టమ్బునిధిలోం గాపుణ్డు టబ్జమ్బు పైం
జెలువొప్పున్ సుఖియిమ్పం గాఞ్చుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 56 ॥

కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగన్ధర్వమున్ బున్కయుం
బులితోలు న్భసితమ్బుం బామ్పతొదవుల్ పోకుణ్డం దోమ్బుట్లకై
తొలి నేవారలతోడం బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా
సిలువుళూరముచేసికొం టెఱిఙ్గియే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 57 ॥

శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధిఞ్చి తత్త్వమ్బులన్
మతి నూహిఞ్చి శరీర మస్థిరము బ్రహ్మమ్బెన్న సత్యమ్బు గాం
చితి మఞ్చున్ సభలన్ వృధావచనము ల్చెప్పఙ్గనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 58 ॥

గతి నీవఞ్చు భజిఞ్చువార లపవర్గం బొన్దగానేల సం
తతముం గూటికినై చరిమ్ప వినలేదా 'యాయు రన్నం ప్రయ
చ్ఛతి' యఞ్చున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాన్ధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానం గానమ్బడవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 59 ॥

రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తం బో
నతం డాదర్పకు వేగ నొత్త గవయం బామ్బోతునుం దాఙ్కి యు
గ్రతం బోరాడఙ్గనున్న యున్నడిమి లేఙ్గల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 60 ॥

అన్తా సంశయమే శరీరఘటనమ్బన్తా విచారమ్బె లో
నన్తా దుఃఖపరమ్పరానివితమె మేనన్తా భయభ్రాన్తమే
యన్తానన్తశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జిన్తన్ నిన్నుం దలఞ్చి పొన్దరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 61 ॥

సన్తోషిఞ్చితినిం జాలుఞ్జాలు రతిరాజద్వారసౌఖ్యమ్బులన్
శాన్తిన్ బొన్దితిం జాలుఞ్జాలు బహురాజద్వారసౌఖ్యమ్బులన్
శాన్తిం బొన్దెదం జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యమ్బు ని
శ్చిన్తన్ శాన్తుణ్డ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 62 ॥

స్తోత్రం బన్యులం జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసమ్బుతోం
బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్
బాత్రం బఞ్చు భజిమ్పమ్బోదు రితియున్ భాష్యమ్బె యివ్వారిచా
రిత్రం బెన్నణ్డు మెచ్చ నెఞ్చ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 63 ॥

అకలఙ్కస్థితి నిల్పి నాడ మను ఘణ్టా(ఆ)రావమున్ బిన్దుదీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానన్దతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారిఞ్చువా
రికిఙ్గా వీడు భవోగ్రబన్ధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 64 ॥

ఒకయర్ధమ్బు నిన్ను నే నడుగఙ్గా నూహిఞ్చి నెట్లైనం బొ
మ్ము కవిత్వమ్బులు నాకుం జెన్దనివి యేమో యణ్టివా నాదుజి
హ్వకు నైసర్గిక కృత్య మిన్తియ సుమీ ప్రార్ధిఞ్చుటే కాదు కో
రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 65 ॥

శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటఞ్చున్సము
త్సుకతం దేరఙ్గం బోవు నచ్చట మహా దుఃఖమ్బు సిద్ధిఞ్చుం; గ
ర్మకళాభాషలకెల్లం బ్రాపులగు శాస్త్రమ్బు ల్విలోకిఞ్చువా
రికి నిత్యత్వమనీష దూరమగుఞ్జూ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 66 ॥

ఒకరిం జమ్పి పదస్థులై బ్రతుకం దామొక్కొక్క రూహిన్తురే
లొకొ తామెన్నణ్డుం జావరో తమకుం బోవో సమ్పదల్ పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్య సుఖమన్దం గన్దురో యున్నవా
రికి లేదో మృతి యెన్నణ్డుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 67 ॥

నీ కారుణ్యముం గల్గినట్టి నరుం డేనీచాలయమ్బుల జొరం
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజిమ్పం డిలనేకష్టప్రకారమ్బులన్
జీకాకై చెడిపోన్దు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 68 ॥

జ్ఞాతుల్ ద్రోహమ్బు వాణ్డ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
మాతణ్డ్రాన సహిమ్పరాదు ప్రతికర్మమ్బిఞ్చుకే జేయగాం
బోతే దోసము గాన మాని యతినై పోఙ్గోరినన్ సర్వదా
చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 69 ॥

చదువుల్ నేర్చిన పణ్డితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవళప్పి వర్తిమ్పఙ్గా
మదనక్రోధకిరాతులన్దుం గని భీమప్రౌఢిచేం దాఙ్కినం
జెదరుం జిత్తము చిత్తగిమ్పఙ్గదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 70 ॥

రోసిం దేణ్టిది రోన్త దేణ్టిది మనొ రోగస్థుణ్డై దేహి తాం
బూసిన్దేణ్టిది పూన్త లేణ్టివి మదా(అ)పూతమ్బు లీ దేహముల్
మూసిన్దేణ్టిది మూన్తలేణ్టివి సదామూఢత్వమే కాని తాం
జేసిన్దేణ్టిది చేన్తలేణ్టివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 71 ॥

శ్రీ శైలేశు భజిన్తునో యభవుఙ్గాఞ్చీ నాధు సేవిన్తునో
కాశీవల్లభుం గొల్వమ్బోదునొ మహా కాళేశుం బూజిన్తునో
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షిమ్పవే నీ కృపా
శ్రీ శృఙ్గారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 72 ॥

అయవారై చరియిమ్పవచ్చుం దన పాదాం(అ)భోజతీర్ధమ్బులన్
దయతోం గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఙ్గాని సిరులన్నిన్దిఞ్చి నిన్నాత్మని
ష్క్రియతం గానఙ్గరాదు పణ్డితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 73 ॥

మాయా(అ) జాణ్డకరణ్డకోటిం బొడిగామర్ధిఞ్చిరో విక్రమా(అ)
జేయుం గాయజుం జమ్పిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దయభుజఙ్గమృత్యువు ననాయాసమ్బునన్ గెల్చిరో
శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 74 ॥

చవిగాం జూడ వినఙ్గ మూర్కొనం దనూసఙ్ఘర్షణాస్వాదమొం
ద వినిర్మిఞ్చెద వేల జన్తువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారమ్బలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
చ్చి వినోదిమ్పఙ్గ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 75 ॥

వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావిమ్పఙ్గ రోన్తయ్యెడున్
వెనుకన్ మున్దట వచ్చు దుర్మరణముల్ వీక్షిమ్ప భీతయ్యెడున్
నను నేఞ్జూడగ నావిధుళలఞ్చియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుఞ్జీఙ్కటియాయెం గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 76 ॥

పరిశీలిఞ్చితి మన్త్రతన్త్రములు చెప్ప న్విణ్టి సాఙ్ఖ్యాదియో
గ రహస్యమ్బులు వేద శాస్త్రములు వక్కాణిఞ్చితిన్ శఙ్కవో
దరయం గుమ్మడికాయలోని యవగిఞ్జన్తైన నమ్మిచ్ఞ్చి సు
స్థిరవిజ్ఞానము త్రోవం జెప్పఙ్గదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 77 ॥

మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలమ్బుగాం జేసి దు
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవమ్బు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీన్దు దలఞ్చిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 78 ॥

కాసన్తైన సుఖం బొనర్చునొ మనఃకామమ్బు లీడేర్చునో
వీసమ్బైనను వెణ్టవచ్చునొ జగద్విఖ్యాతిం గావిఞ్చునో
దోసమ్బు ల్బెడం బొపునో వలసినన్దోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 79 ॥

ఒకపూణ్టిఞ్చుక కూడ తక్కువగునే నోర్వఙ్గలేం డెణ్డకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుమ్పట్లెత్తుకోఞ్జూచు వా
నకు నిణ్డిణ్డ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యమ్బు రో
సి కడాసిమ్పరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 80 ॥

కేదారాదిసమస్తతీర్ధములు కోర్మిఞ్జూడం బోనేణ్టికిన్
గాడా ముఙ్గిలి వారణాసి! కడుపే కైలాసశైలమ్బు మీ
పాదధ్యానము సమ్భవిఞ్చునపుడే భావిమ్ప నజ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 81 ॥

తమకొం బొప్పం బరాఙ్గనాజనపర ద్రవ్యమ్బులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొఙ్గం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగిమఞ్చి నీదుచరణ స్తమ్భఞ్జునం గట్టివై
చి ముదం బెప్పుడుం గల్గఞ్జేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 82 ॥

వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులఞ్జేయ నే
లా ధీచాతురిం జేసెం జేసిన గులామాపాటనే పోక క్షు
ద్బాధాదుల్ గలిగిమ్పనేల యది కృత్యమ్బైన దుర్మార్గులం
జీ! ధాత్రీశులం జేయనేణ్టి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 83 ॥

పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేం బూజిఞ్చి పుణ్యమ్బునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదమ్బులం
గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం
జెడి యెన్దుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 84 ॥

విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశమ్బు రక్షామ్బువుల్
మత్తత్వమ్బు తదఙ్కురం ఐనృతముల్ మాఱాకు లత్యన్తదు
ద్వృత్తుల్ పువ్వులుం బణ్డ్లు మన్మధముఖా విర్భూతదోషమ్బులుం
జిత్తాధ్యున్నతనిమ్బభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 85 ॥

నీపైం గాప్యము చెప్పుచున్న యతణ్డున్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠమ్మొనరిన్తునన్న యతణ్డున్ మఞ్జుప్రబన్ధమ్బు ని
ష్టాపూర్తిం బఠియిఞ్చుచున్న యతణ్డున్ సద్బాన్ధవుల్ గాక చీ
చీ! పృష్ఠాగతబాన్ధవమ్బు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 86 ॥

సమ్పద్గర్వముం బాఱన్ద్రోలి రిపులన్ జఙ్కిఞ్చి యాకాఙ్క్షలన్
దమ్పుల్వెట్టి కళఙ్కము ల్నఱకి బన్ధక్లేశదోషమ్బులం
జిమ్పుల్సేసి వయోవిలాసములు సఙ్క్షేపిఞ్చి భూతమ్బులం
జెమ్పల్వేయక నిన్నుం గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 87 ॥

రాజశ్రేణికి దాసులై సిరులం గోరం జేరఙ్గా సౌఖ్యమో
యీ జన్మమ్బు తరిమ్పఞ్జేయగల మిమ్మే ప్రొద్దు సేవిఞ్చు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాన్ధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 88 ॥

నిన్నం జూడరొ మొన్నం జూడరో జనుల్ నిత్యమ్బు జావఙ్గ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాన్తిన్ విసర్జిమ్పలే
కున్నా రెన్నణ్డు నిన్ను గణ్డు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 89 ॥

నన్నే యెనుఙ్గుతోలుదుప్పటము బువ్వాకాలకూతమ్బు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కణ్ఠహారమ్బు మేల్
నిన్నీలాగున నుణ్టయుం దెలిసియున్ నీపాదపద్మమ్బు చే
ర్చెన్ నారయణుం డెట్లు మానసముం దా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 90 ॥

ద్వారద్వారములన్దుం జఞ్చుకిజనవ్రాతమ్బు దణ్డమ్ములన్
దోరన్త్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఙ్గామ్బోరుల
క్ష్మీరాజ్యమ్బును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 91 ॥

ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయున్దం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
పూరం బేరులం బాఱదో తపసులమ్బ్రోవఙ్గ నీవోపవో
చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 92 ॥

దయ జూడుణ్డని గొన్దఱాడుదురు నిత్యమ్బున్ నినుం గొల్చుచున్
నియమం బెన్తో ఫలమ్బు నన్తియెకదా నీవీయ పిణ్డెన్తో అం
తియకా నిప్పటియుం దలమ్పనను బుద్ధిం జూడ; నేలబ్బుని
ష్క్రియతన్ నిన్ను భజిమ్ప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 93 ॥

ఆరావం బుదయిఞ్చెం దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోఙ్కారాభిధానమ్బు చె
న్నారున్ విశ్వ మనఙ్గం దన్మహిమచే నానాదబిన్దుల్ సుఖ
శ్రీ రఞ్జిల్లం గడఙ్గు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 94 ॥

నీభక్తు ల్మదివేల భఙ్గుల నినున్సేవిమ్బుచున్ వేడఙ్గా
లోభమ్బేటికి వారి కోర్కులు కృపళుత్వమ్బునం దీర్మరా
దా భవ్యమ్బుం దలఞ్చి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాణ్డరములోం గొఱన్తపడునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 95 ॥

మొదలన్భక్తులకిచ్చినాణ్డవుగదా మోక్షమ్బు నేం డేమయా
'ముదియఙ్గా ముదియఙ్గం బుట్టు ఘనమౌ మోహమ్బు లోభమ్బు' న
న్నది సత్యమ్బు కృపం దలమ్ప నొకవుణ్యాత్ముణ్డు నిన్నాత్మ గొ
ల్చి దినమ్బున్ మొఱవెట్టఙ్గాం గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 96 ॥

కాలద్వారకవాటబన్ధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రమ్బు ది
క్చేలాలఙ్కృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 97 ॥

పదివేలలైనను లోకకణ్టకులచేం బ్రాప్రిఞ్చు సౌఖ్యమ్బు నా
మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుణ్డై సత్యదా
నదయాదుల్ గల రాజు నాకొసఙ్గు మేనవ్వాని నీ యట్లచూ
చి దినమ్బున్ ముదమొన్దుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 98 ॥

తాతల్ తల్లియుం దణ్డ్రియున్ మఱియుం బెద్దల్ చావగాం జూడరో
భీతిం బొన్దఙ్గనేల చావునకుఙ్గాం బెణ్డ్లాముబిడ్డల్ హిత
వ్రాతమ్బున్ బలవిమ్ప జన్తువులకున్ వాలాయమైయుణ్డఙ్గాం
జేతోవీధి నరుణ్డు నిన్గొలువణ్డో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 99 ॥

జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సన్ధిఞ్చు టన్యాయవి
ఖ్యాతిం బొన్దుట కొణ్డెకాణ్డవుట హింసారమ్భకుణ్డౌట మి
ధ్యాతాత్పర్యములాడుటన్నియుం బరద్రవ్యమ్బునాశిఞ్చి యీ
శ్రీ తా నెన్నియుగమ్బు లుణ్డఙ్గలదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 100 ॥

చెడుగుల్ కొన్దఱు కూడి చేయఙ్గమ్బనుల్ చీకట్లు దూఱఙ్గం మా
ల్పడితిం గాన గ్రహిమ్పరాని నిను నొల్లఞ్జాలం బొమ్మఞ్చు నిల్
వెలన్ద్రోచినం జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిం గో
రెడి యర్ధమ్బులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 101 ॥

భసితోద్ధూళనధూసరాఙ్గులు జటాభారోత్తమాఙ్గుల్ తపో
వ్యసనముల్ సాధితపఞ్చవర్ణరసముల్ వైరాగ్యవన్తుల్ నితాం
తసుఖస్వాన్తులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 102 ॥

జలజశ్రీ గల మఞ్చినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే!
వెలివాడ న్మఱి బామ్పనిల్లుగలదావేసాలుగా నక్కటా!
నలి నా రెణ్డు గుణమ్బు లెఞ్చి మదిలో నన్నేమి రోయఙ్గ నీ
చెలువమ్బైన గుణమ్బు లెఞ్చుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 103 ॥

గడియల్ రెణ్టికొ మూణ్టికో గడియకో కాదేని నేణ్డెల్లియో
కడ నేణ్డాదికొ యెన్నణ్డో యెఱుం గ మీకాయమ్బు లీభూమిపైం
బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటిమ్ప రీ మానవుల్
చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 104 ॥

క్షితిలో దొడ్డతురఙ్గసామజము లేచిత్రమ్ము లాన్దోళికా
తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చిఞ్చుచో
జితపఙ్కేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 105 ॥

సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని
శ్చలబక్తిప్రపత్తిచే నరుణ్డు పూజల్ సేయఙ్గా ధన్యుణ్డౌ
నిల గఙ్గాజలచన్ద్రఖణ్డముల దానిన్దుం దుదిం గాఞ్చు నీ
చెలువం బన్తయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 106 ॥

తమనేత్రద్యుతిం దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఙ్గా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనమ్బూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 107 ॥

పటవద్రజ్జుభుజఙ్గవద్రజతవి భ్రాన్తిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చన్ద్రశిలాజపాకుసుమరు క్సాఙ్గత్యవత్తఞ్చువా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవిమ్పన్ లేక దుర్మేధనుల్
చిటుకన్నం దలపోయఞ్జూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 108 ॥

నిను నిన్దిఞ్చిన దక్షుపైం దెగవొ వాణీనాధు శాసిమ్పవో
చనునా నీ పాదపద్మసేవకులం దుచ్ఛం బాడు దుర్మార్గులం
బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదమ్బు గానఙ్గ వ
చ్చెనొ లేకుణ్డిన నూఱకుణ్డగలవా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 109 ॥

కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తమ్బు గాదో రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గమ్బు చల్లాఱెనో
పరనిన్దాపరులన్ వధిమ్ప విదియున్ భాష్యమ్బె వారేమి చే
సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 110 ॥

దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొఙ్గర్మమున్ వైద్యమున్
నరనాధాశ్రయ మోడబేరమును బెన్మన్త్రమ్బు సిద్ధిఞ్చినన్
అరయన్ దొడ్డఫలమ్బు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 111 ॥

తనయుం గాఞ్చి ధనమ్బు నిఞ్చి దివిజస్థానమ్బు గట్టిఞ్చి వి
ప్రున కుద్వాహము జేసి సత్కృతికిం బాత్రుణ్డై తటాకమ్బు నే
ర్పునం ద్రవ్విఞ్చి వనమ్బు వెట్టి మననీ పోలేడు నీసేవం జే
సిన పుణ్యాత్ముణ్డు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 112 ॥

క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుణ్డ్ వచ్చెన్ మిమ్ములం జూడఙ్గా
నతణ్డే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
ప్రతిభ ల్మఞ్చిని తిట్టుపద్యములు చెప్పుం దాతణ్డైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటఞ్చు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 113 ॥

నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనఞ్చు మీదెత్తితిన్
జేకొణ్టిన్ బిరుదమ్బు కఙ్కణము ముఞ్జేం గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతమ్బు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలమ్బులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 114 ॥

నిచ్చల్ నిన్ను భజిఞ్చి చిన్మయమహా నిర్వాణపీఠమ్బు పై
రచ్చల్సేయక యార్జవమ్బు కుజన వ్రాతమ్బుచేం గ్రాఙ్గి భూ
భృచ్చణ్డాలురం గొల్చి వారు దనుం గోపిమ్మన్ బుధుం డార్తుణ్డై
చిచ్చారం జము రెల్లం జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 115 ॥

దన్తమ్బు ల్పడనప్పుడే తనువునన్దారూఢి యున్నప్పుడే
కాన్తాసఙ్ఘము రోయనప్పుడే జరక్రాన్తమ్బు గానప్పుడే
వితల్మేన జరిఞ్చనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చిన్తిమ్పన్వలె నీపదామ్బుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 116 ॥




Browse Related Categories: